ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవాళ్లు: హరీశ్ రావు
- నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తేజస్వి సూర్య కించపరిచారన్న హరీశ్
- తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడిందని వ్యాఖ్య
- రక్తపాతంతో కూడిన విభజనతో తెలంగాణను పోలుస్తారా అని మండిపాటు
- మోదీ బాటలో నడుస్తూ తేజస్వి విషం చిమ్ముతున్నారని ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువతీ యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను, రక్తపాతంతో కూడిన విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని గుర్తుచేసిన హరీశ్ రావు... ఈ రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు భారత్-పాక్ విభజన వంటిదే అయితే, ఆనాడు పార్లమెంట్‌లో బీజేపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ కూడా రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మౌనాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి, ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను ఇక్కడి ప్రజలు ఎన్నడూ క్షమించరని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.